డీఎస్పీగా నటిస్తూ నిరుద్యోగులకు టోకరా.. నకిలీ పోలీసు అరెస్ట్
డీఎస్పీగా నటిస్తూ నిరుద్యోగులకు టోకరా
ఎస్‌ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.26 లక్షల వసూలు.. నిందితుడి నుంచి నగదు, నకిలీ నియామక పత్రాలు స్వాధీనం
ఏలూరు: తాను గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని నమ్మిస్తూ, ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని ఏలూరు రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్‌ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన ఇద్దరు నిరుద్యోగుల నుంచి రూ.26 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు పోలీసు అధికారిగా పరిచయం చేసుకుంటూ నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న బాధితులను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.5.50 లక్షల నగదుతో పాటు నకిలీ నియామక ఉత్తర్వులు, పోలీసు రబ్బరు స్టాంపులు, పోలీసు యూనిఫామ్, వాకీటాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఏలూరు రెండో పట్టణ పోలీసులు ఈ కేసును ఛేదించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన రెండో పట్టణ సీఐ కె. అశోక్ కుమార్, ఎస్‌ఐ బి. మధు వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించి అధికారిక ప్రకటనలు, సంబంధిత శాఖల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ఉద్యోగాల ఆశతో అపరిచిత వ్యక్తులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు.