చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం
చింతలపూడి, అక్టోబర్ 6: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి, ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బేబీ కమల, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.