కొండేపిలో ఉచిత మెగా వైద్య శిబిరం
కొండేపి: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14, 2026న కొండేపి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు సేవలందించనున్నారు.
ఈ శిబిరంలో గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చర్మవ్యాధులు, కంటి వైద్యం, ఎముకల వైద్యం, దంత వైద్యం, ఆయుర్వేద విభాగాల్లో వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు అందుబాటులో ఉంటాయి. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు, రక్తదాన ప్రతిజ్ఞ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హెచ్‌సీజీ ఎంఎన్‌ఆర్ క్యాన్సర్ ఆసుపత్రి నిపుణుల బృందం ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. 50 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రోస్టేట్ సంబంధిత పీఎస్‌ఏ పరీక్ష, 45 ఏళ్లు పైబడిన మహిళలకు రొమ్ము థర్మల్ స్కానింగ్, సీఏ-125 పరీక్షలతో పాటు మహిళలకు పాప్ స్మియర్ పరీక్షలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయులు, కిడ్నీ పనితీరు, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్, కామెర్లు, మూత్ర సంబంధిత పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.
పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కొండేపి ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ అవినాష్ కోరారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సలహాలు పొందేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.