ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ఎల్బీనగర్ | ఎన్ టుడే న్యూస్ | అక్టోబర్ 27:
ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో సహృదయంతో వ్యవహరించాలని, విధుల నిర్వహణలో వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళికను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పరామర్శించారు. ప్రయాణికుడు తోసివేయడంతో బస్సు టైరు కిందపడి ఆమె ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి గురైన ఉద్యోగినికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే క్రమంలో వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సిబ్బందిపై దాడులు, దురుసు ప్రవర్తన వంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు.
ప్రజా రవాణా వ్యవస్థ సజావుగా సాగేందుకు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది పరస్పర గౌరవంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.