ఆరుట్లలో బెల్ట్ షాపులు మూసివేయాలని గ్రామపంచాయతీ తీర్మానం
యువత భవిష్యత్తు, ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యం: సర్పంచ్ మానుపాటి శోభ
ఇబ్రహీంపట్నం | ఎన్ టుడే న్యూస్:
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రించి, మద్యం విక్రయాలను నిలిపివేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించి, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకవర్గం తెలిపింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మానుపాటి శోభ మాట్లాడుతూ.. గ్రామంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం పాలకవర్గం లక్ష్యమని పేర్కొన్నారు.
ఉపసర్పంచ్ రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నేటి యువతే రేపటి పౌరులని, వారిని మంచి మార్గంలో నడిపించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలందరూ బెల్ట్ షాపుల నియంత్రణకు సహకరించాలని కోరారు.
గ్రామంలో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.