గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మాదాపూర్‌లోని స్వాతి హైస్కూల్ ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి మార్గాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
అంటరానితనం నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, గ్రామ స్వరాజ్యం, మహిళల సాధికారత, సామాజిక సమానత్వం వంటి అంశాలకు గాంధీజీ ప్రాధాన్యత ఇచ్చారని రామస్వామి యాదవ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో అహింస, శాంతి విలువలను ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తోందని తెలిపారు.
లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా అందించిన సేవలను ఆయన స్మరించుకున్నారు. 1965 భారత్–పాకిస్థాన్ యుద్ధ సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారని, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. శాస్త్రి జీవితం నుంచి నేటి యువత నిజాయితీ, నిబద్ధత వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
దేశ అభివృద్ధికి సమైక్యత, సమగ్రత అవసరమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామస్వామి యాదవ్ కోరారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రిక, అధ్యాపకులు, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, శివరామకృష్ణ, జి.వి.రావు, సత్యనారాయణ, నండూరి వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.