పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు
కులమత వివక్షపై తన కవిత్వంతో పోరాడిన జాషువా: టీడీపీ నాయకులు
పెదకూరపాడు, సెప్టెంబర్ 28:
మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను పెదకూరపాడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో అచ్చంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాషువా చిత్రపటానికి నివాళులర్పించారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత జాషువా చిత్రపటానికి ఎంపీడీవో కొయ్య శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బత్తుల శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించగా, పాటిబండ్ల బాపిరాజు జాషువా సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట మండల టీడీపీ అధ్యక్షుడు నందిగామ ఆశీర్వాదం మాట్లాడుతూ కష్టజీవుల జీవితాలను తన రచనల్లో ప్రతిబింబించిన కవి గుర్రం జాషువా అని పేర్కొన్నారు. కులమత మూఢనమ్మకాలు, సామాజిక వివక్షపై తన కవిత్వం ద్వారా గళమెత్తారని అన్నారు.
ఆంధ్రజ్యోతి విలేకరి సింహరాయలు మాట్లాడుతూ కుల వివక్షను ఎదుర్కొంటూనే తన సాహిత్య ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందిన జాషువా విశ్వనరుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉన్నాయని తెలిపారు.
జాషువా సాహిత్యాన్ని, సామాజిక సందేశాన్ని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఎన్ టుడే న్యూస్ | పెదకూరపాడు నియోజకవర్గ రిపోర్టర్
బయ్యవరపు నాగరాజు