ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు–2026 ఏర్పాట్లపై సోమవారం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన దేవస్థానంలో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ వర్ల రామయ్య, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి. ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్, డీసీపీ జి. రామకృష్ణ, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దసరా ఉత్సవాల నిర్వహణ, భక్తుల దర్శనం, క్యూలైన్లు, రద్దీ నియంత్రణ, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
25 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం
మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు వైదిక కమిటీ సూచనల మేరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు ఉత్సవాల అనంతరం భవానీ దీక్షల విరమణకు వచ్చే భవానీ భక్తులను కలిపి 25 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఘాట్‌రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సమన్వయం చేస్తూ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ, వర్షం ఇబ్బంది లేకుండా షెడ్లు, తాగునీరు, కూర్చునే సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్యూలైన్లలో దర్శనానికి పట్టే సమయాన్ని భక్తులకు తెలియజేసేందుకు ఎల్‌ఈడీ, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతన ప్రసాదాల తయారీ వసతులు, విశాలమైన అన్నదాన భవనాల ద్వారా నిరంతరం అన్నప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం సుమారు 60 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
సామాన్య భక్తుడే ప్రథమ ప్రాధాన్యత: కేశినేని చిన్ని
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడు సంతృప్తిగా అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్ రహిత విధానంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో చంటిపిల్లలతో వచ్చే తల్లుల కోసం వేడిపాలు, బిస్కెట్లు అందించే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వీఐపీ సంస్కృతికి దూరంగా ఏర్పాట్లు: వర్ల రామయ్య
దసరా నవరాత్రులు భక్తులందరి పండుగ అని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులు గంటల తరబడి నిరీక్షించకుండా త్వరితగతిన దర్శనం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ ఉత్సవాల సమయంలో విధులతో సంబంధం లేని వివిధ శాఖల సిబ్బంది కొండపైకి రావడం వల్ల సున్నిత ప్రాంతాల్లో రద్దీ నియంత్రణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
గతంలో మూలా నక్షత్రం రోజున అధిక రద్దీ కారణంగా కొంతమంది భక్తులు దర్శనం చేసుకోలేక వెనుదిరిగిన పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. ఈసారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఏఐ కెమెరాలు, సీసీటీవీలతో నిఘా
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏఐ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కొండపై, పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తామని, నగర శివార్లు, ప్రధాన కూడళ్లలో పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పార్కింగ్ ప్రాంతాల నుంచి భక్తులను ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలించేందుకు ఉచిత షటిల్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.
24 గంటల వైద్య సేవలు
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి. ఇలక్కియ మాట్లాడుతూ దసరా మహోత్సవాల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు.
భక్తుల ఆరోగ్య రక్షణ కోసం ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు, కీలక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవల కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.
ఆర్జిత సేవలకు డిజిటల్ సదుపాయాలు
నూతన పూజా మండపంలో ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవల టికెట్లను దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
పరోక్ష సేవలను బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను వారి చిరునామాలకు తపాలా ద్వారా పంపేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రతిరోజూ నగరోత్సవం
దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణ కోసం జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనున్నట్లు తెలిపారు. డిజిటల్ కియోస్క్‌లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భక్తుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ అధికారులు, దేవస్థానం సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.