పుంగనూరులో పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు: పుంగనూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
2025 డిసెంబర్ 8న లబ్ధిదారులతో కలిసి అధికారులకు అర్జీలు అందజేసినప్పటికీ ఇప్పటివరకు వాటిపై తగిన చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2026 జూలై 19న ముఖ్యమంత్రి జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి, గతంలో మంజూరైన ఇంటి స్థలాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అధికారులు గతంలో సమర్పించిన అర్జీలను పరిశీలించి, అర్హులైన పేదలకు త్వరితగతిన ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎ. నాగరాజు, కె. గంగాధర్, ఎస్. దయాకర్ రాజు, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు బి. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.