డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీ.. కాలనీవాసులతో కలిసి పర్యటన
ఎల్బీనగర్, (ఎన్ టుడే న్యూస్):
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో కాలనీవాసులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి వెంకట నరసయ్యతో సమస్యను చర్చించారు.
డంపింగ్ యార్డ్ నుంచి ప్రతిరోజూ తీవ్ర దుర్వాసన వస్తోందని, వ్యర్థాలు, మురుగునీటి కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు వ్యర్థాల నుంచి వెలువడే దుర్వాసన మరింత ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల 60 ఏళ్లు పైబడిన వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
గతంలో పలు చర్యలు చేపట్టాం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి గతంలోనే సుమారు రూ.6 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలను తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో గతంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త వేస్తున్న లారీలను గుర్తించి భారీ జరిమానాలు విధించినట్లు తెలిపారు.
హైడ్రా, జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ, హైలా తదితర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నిల్వ ఉన్న మురుగునీటిని తరలించేందుకు ట్యాంకర్లు, మోటార్లు ఏర్పాటు చేయించినట్లు వివరించారు. జంతు కళేబరాలు, ఇతర వ్యర్థాలు పడేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని, అక్కడ వాచ్‌మెన్‌ను నియమించడంతో పాటు ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు.
ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్, ఫర్టిలైజర్ గోడౌన్లు, మెకానికల్ షెడ్లను తనిఖీ చేసి, డ్రైనేజీ మార్గాల ద్వారా వ్యర్థాలు, రసాయనాలను విడుదల చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి సంబంధించిన పనుల్లో దాదాపు 90 శాతం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ కొందరు కాలనీవాసులు గ్రూపుల్లో విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. అయితే, ఏది ఏమైనా డంపింగ్ యార్డ్ పరిసర కాలనీల ప్రజలకు దుర్వాసన సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, సంతోష్ గుప్తా, రవి, బాలరాజుతో పాటు డంపింగ్ యార్డ్ ప్రభావిత కాలనీల అధ్యక్షులు అంజయ్య గౌడ్, గోపికృష్ణరెడ్డి, రమేష్, రవి, విజయ, ప్రభాకర్, సాంబిరెడ్డి, రాజేష్, రంగారెడ్డి, వాసు యాదవ్, గాలయ్య, భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.