తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ శిక్షణ
తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్, మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్, డీప్ లెర్నింగ్‌తో పాటు జీవితాంతం ఉపయోగపడే ప్రొఫెషనల్ స్కిల్స్ వంటి అంశాలపై విద్యార్థులు శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం విద్యార్థులకు ఎంతో అవసరమని సూచించారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పురం శెట్టి రంగారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను నిరంతరం అభ్యసిస్తూ వాటిలో మరింత పరిణతి సాధించాలని సూచించారు. డిగ్రీ విద్యతో పాటు అదనంగా సాంకేతిక, ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
కంప్యూటర్ విభాగం ఉపన్యాసకులు ఆదిలక్ష్మి పర్యవేక్షణలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగినందుకు ప్రిన్సిపాల్ ఆమెను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు సూచించారు.