నూజివీడు ఎక్సైజ్ స్టేషన్‌లో ఉన్నతాధికారుల తనిఖీలు
పెండింగ్ కేసుల పరిష్కారం, నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నూజివీడు, అక్టోబర్ 12: ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి.హెచ్. అజయ్ కుమార్ సింగ్ సందర్శించి, స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే.వి. నాగ ప్రభు కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించాలని సూచించారు.
అనంతరం ఎక్సైజ్ సిబ్బందితో సమావేశమైన ఉన్నతాధికారి స్టేషన్ పనితీరు, కేసుల పురోగతి, అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా నాటుసారా తయారీ, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, బెల్లం ఊట, తయారీ స్థావరాలు, రవాణా మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
నాటుసారా తయారీదారులకు ముడి పదార్థాలను సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో నాటుసారా తయారీకి పాల్పడిన వ్యక్తుల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని, తిరిగి అదే కార్యకలాపాలకు పాల్పడకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన వారికి పునరావాస కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.
అక్రమ మద్యం తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా రెవెన్యూ, పోలీస్, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీని అరికట్టడంతో పాటు, పెండింగ్ కేసుల పరిష్కారం, పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అరెస్టులు, అక్రమ మద్యం నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.