మంచిర్యాలలో జంగల్ సఫారీ మారథాన్
జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఐఏఎస్ మకరందు
ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ధ్యేయంగా మంచిర్యాల నియోజకవర్గంలో దేశీయ స్థాయి తొలి అటవీ సఫారీ మారథాన్ ఘనంగా మొదలైంది. తెలంగాణ అటవీ శాఖ, గ్రీన్‌సీకర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జంగల్ సఫారీ, ఏసీసీ క్వారీ వద్ద ఈ వినూత్న పరుగును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నిర్వహించిన ముప్పై, పది, ఐదు కిలోమీటర్ల విభాగాల పరుగు పోటీలను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ మంద మకరందు ఐఏఎస్, డీఎఫ్‌వో శ్రీ రాహుల్ కిషన్ జాదవ్, డైరెక్టర్ శ్రీ శాంతారామ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. అడవుల సహజ సౌందర్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన అటవీ శాఖ అధికారులను, ఫౌండేషన్ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందించారు. పచ్చని ప్రకృతి ఒడిలో సాగిన ఈ మారథాన్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, యువత, ప్రకృతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని, ఆరోగ్య స్పృహను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు