మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
పంచ్‌లు, కిక్‌లు, కాటాలతో విద్యార్థుల మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ
మన్సూరాబాద్, (ఎన్ టుడే న్యూస్): ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ శ్రీరామ్ హిల్స్ కాలనీ, రోడ్ నంబర్ 2లో యోధా గోజు ర్యూ స్పోర్ట్స్ కరాటే డూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే బెల్ట్ పరీక్షలు ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ పరీక్షల్లో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని పంచ్‌లు, కిక్‌లు, కాటాలతో తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వాహకులు కొత్త బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ కరాటే మాస్టర్లు పి.ఎం. రాము, బి. రాము, ఎ. సతీష్, అరుణ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మరక్షణ విద్యలు కూడా ఎంతో అవసరమని అన్నారు. క్రమం తప్పకుండా కరాటే సాధన చేయడం వల్ల పిల్లల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు, శారీరక దృఢత్వం పెరగడంతోపాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయని వివరించారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను మాస్టర్లు అభినందించారు. పిల్లలను కరాటే సాధన వైపు ప్రోత్సహిస్తూ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు నిర్వాహక బృందం కృతజ్ఞతలు తెలిపింది.