విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడిన కొక్కిరాల సురేఖ, డిప్యూటీ మేయర్ రమ్య
మంచిర్యాల: తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులతో కలిసి అతిథులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సంప్రదాయ పాటలు, చప్పట్లతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పే బతుకమ్మ వేడుకల్లో విద్యార్థినులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని అభినందించారు.
అనంతరం అధ్యాపకులు, విద్యార్థినులకు సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం కొక్కిరాల సురేఖను శాలువాతో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.