మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి
విద్యార్థుల ఆందోళనకు హరీష్ రావు సంఘీభావం.. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
మహేశ్వరం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): మహేశ్వరం నియోజకవర్గానికి కేటాయించిన మెడికల్ కాలేజీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం
మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించడంతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీష్ రావు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించి, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.