మానవత్వాన్ని చాటిన గాయత్రికి ఎమ్మెల్యే మద్దిపాటి అండ
ఆంధ్రప్రదేశ్
రూ.10 వేల ఆర్థిక సహాయం.. సొంత స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నప్రసాద కేంద్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గాయత్రి చూపిన సేవాభావాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు అభినందించారు.
రెండు చేతులు లేని దివ్యాంగ భక్తుడికి గాయత్రి స్వయంగా భోజనం తినిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి గాయత్రిని అభినందించినట్లు తెలిపారు. గాయత్రి తన చర్య ద్వారా ‘మానవ సేవే మాధవ సేవ’ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గాయత్రిని వ్యక్తిగతంగా అభినందించారు. తన సొంత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా గాయత్రికి సొంత ఇంటి స్థలం సమకూర్చి, ఆ స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనసుతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడం, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గాయత్రి చూపిన సేవాభావం సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అవసరంలో ఉన్న దివ్యాంగ భక్తుడికి ఆప్యాయతతో స్వయంగా భోజనం తినిపించడం మానవీయతకు నిదర్శనమని అన్నారు. సేవా కార్యక్రమాలు చేసే వారికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
గాయత్రి చూపిన మానవత్వం, సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.
మానవత్వానికి చేయూత.. సేవ చేసే వారికి అండగా – మద్దిపాటి