మున్నేరు–పాలేరు లింకు కాలువ పనులు నిలిపివేయాలి
పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి.. ప్రత్యామ్నాయ మార్గాలనూ పరిశీలించాలి
గార్ల, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్:
మున్నేరు–పాలేరు లింకు కాలువ పనులను నిలిపివేసి, ప్రభావిత గ్రామాల్లో పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆదేశించినట్లు బాధిత గిరిజన రైతుల తరఫు న్యాయవాది విశ్వ జంపాల తెలిపారు. కాలువ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలని కమిషన్ సూచించినట్లు వెల్లడించారు.
మున్నేరు–పాలేరు లింకు కాలువతో పాటు జీవో నంబర్లు 98, 7 రద్దు చేయాలని కోరుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ నిర్వహించిన విచారణకు సంబంధించిన వివరాలను మంగళవారం గార్ల మండల కేంద్రంలోని తన న్యాయవాద కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ జంపాల వెల్లడించారు.
హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వ జంపాల తెలిపారు.
ముల్కనూరు, చంద్రగిరి, గార్ల, బుద్ధారం గ్రామాల్లో పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని, మున్నేరు–పాలేరు లింకు కాలువ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కమిషన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా ప్రభావిత గిరిజన రైతుల అభ్యంతరాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు వివరించారు.
మున్నేరు–పాలేరు లింకు కాలువకు సంబంధించిన జీవో నంబర్లు 98, 7 రద్దు చేయాలని బాధిత రైతులు కోరుతున్నట్లు విశ్వ జంపాల తెలిపారు. కాలువ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే గిరిజన రైతుల హక్కులు, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో బాధిత రైతుల తరఫు న్యాయవాది, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ జంపాల, హైకోర్టు న్యాయవాది నల్లమాస కృష్ణ, మహబూబాబాద్ ఆర్డీఓ, పాలేరు ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
బాధిత రైతులు మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, మూడు హరి, భూక్యా హనుమంతు, బాదావత్ చంటి, బాదావత్ సేవియా, బాదావత్ శ్రీను, మూడు రాము, మూడు వాల్యా, మూడు రమేష్, భూక్యా శంకర్, భూక్యా రమేష్, జాటోతు దేవా, బానోత్ రమేష్, మూడు భాస్కర్, మూడు నందులాల్, మూడు పడితి, అశోక్, మూడు పవన్, సోమ శ్రీకాంత్, వాంకుడోత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి, తారక రామారావు, మోహిన్, తాళ్లూరి అనిల్, లక్ష్మీశెట్టి శ్రీనాథ్, తాళ్లూరి సునీల్ తదితరులు హాజరయ్యారు.