వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి వేముల బక్కయ్య
ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలంలో పదేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) పే స్కేల్ అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
ముసునూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతి పంచాయతీకి ఒక వీఆర్ఏ విధులు నిర్వహించాల్సి ఉండగా ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలకు రెండు, మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగిస్తూ అదనపు పనిభారం మోపుతున్నారని పేర్కొన్నారు. ఉదయం విధులకు వెళ్లిన వారు రాత్రి ఏ సమయానికి ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.
ప్రభుత్వానికి నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏలు కుటుంబాలకు సమయం కేటాయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో వారి ఆర్థిక పరిస్థితి భారంగా మారిందని బక్కయ్య తెలిపారు. ఖాళీగా ఉన్న వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయకుండా అదనపు పంచాయతీల పనులను కూడా వారితోనే చేయించడం సరికాదని అన్నారు.
వీఆర్ఏలకు న్యాయపరంగా పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హత ఉన్న వారికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నామినీ ప్రాతిపదికన కొనసాగుతున్న వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించాల్సిన అన్ని రకాల సేవలు, ప్రయోజనాలను వీఆర్ఏలకు అందించాలని వేముల బక్కయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు పల్లెపాము భవానితో పాటు పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.