చిత్తూరులో ఆక్రమణల తొలగింపు
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
చిత్తూరు, ఎన్‌టుడే న్యూస్: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు వాహనదారులు, పాదచారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. నరసింహరాజు ఆధ్వర్యంలో పోలీసులు, చిత్తూరు కార్పొరేషన్ హెల్త్, శానిటరీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమన్వయంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
నగరంలోని ఎం.జి.ఆర్. స్ట్రీట్, దర్గా స్ట్రీట్, ఎం.ఎస్.ఆర్. జంక్షన్, పలమనేరు రోడ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహించారు. రహదారులపైకి వచ్చి వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించారు.
రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులకు పోలీసులు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. దుకాణాల పరిధిని దాటి వ్యాపార సామగ్రిని రహదారులపై ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. నరసింహరాజు మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులతో పాటు ప్రజలు, వ్యాపారులు, సంబంధిత శాఖల సిబ్బంది సహకారం అవసరమన్నారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇకపై కూడా ఆక్రమణలపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణ పాటిస్తూ పోలీసు, మున్సిపల్ సిబ్బందికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.