ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ.6 లక్షల సాయం
హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్ క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సంతాపం తెలిపి, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సుదర్శన్ గౌడ్ భార్య చేసిన విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధులు విడుదల చేసేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.