గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
ప్రజారోగ్యం, పరిశుభ్రతకు అనుగుణంగా డ్రైనేజీ పనులు చేపట్టాలి: మంత్రి పార్థసారథి
ఏలూరు/నూజివీడు, అక్టోబర్ 7: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
నూజివీడు మండలం కొన్నంగుంట గ్రామంలో బుధవారం జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి కొలుసు పార్థసారథి గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను పేరుపేరునా పలకరిస్తూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా డ్రైనేజీ నిర్మాణంలో మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా తగిన వాలుతో శాస్త్రీయ పద్ధతిలో పనులు చేపట్టాలని సూచించారు.
డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మాత్రమే వినియోగించాలని, పనుల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండటం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలను తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీరు, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.