ఉత్తర–దక్షిణ భారత అనుసంధానానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఇవ్వాలి
సికింద్రాబాద్ | ఎన్ టుడే న్యూస్:
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ నూతన రైల్వే లైన్ రీ సర్వే నివేదికను తుది సాంకేతిక పరిశీలన అనంతరం ఖరారు చేసి, ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు నంగే శ్రీనివాస్ కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టు ఆమోదం, నిధుల కేటాయింపుల కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డుకు సానుకూల సిఫారసులు పంపాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో జాతీయ రహదారి వెంట ప్రతిపాదించిన రైల్వే మార్గంలో భారీ నిర్మాణ వ్యయం, క్లిష్టమైన ఘాట్ ప్రాంతాలు, సొరంగాలు, వంతెనల నిర్మాణం వంటి అంశాల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేకపోయిందని నంగే శ్రీనివాస్ వివరించారు. గతంలో సుమారు రూ.4,500 కోట్లుగా అంచనా వేసిన వ్యయాన్ని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గణనీయంగా తగ్గించే అవకాశాలను సాంకేతికంగా పరిశీలించాలని కోరారు.
ఆదిలాబాద్ నుంచి బరంపూర్, బజార్‌హత్నూర్, సోనాల, కౌట, కనుగుట్ట, వాచేరా, కుట్లాపూర్, ధర్మారం ప్రాంతాలను కలుపుతూ కడలి పోచమ్మ పుణ్యక్షేత్రానికి సమీపంగా నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, పర్యాటక రంగాలకు ప్రయోజనం కలుగుతుందని నంగే శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్మూర్ మార్గాన్ని నిజామాబాద్ బైపాస్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్లే రైల్వే లైన్‌తో అనుసంధానిస్తే, నిజామాబాద్ స్టేషన్‌కు వెళ్లి తిరిగి ప్రయాణ దిశ మార్చుకోవాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అయ్యే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
ఈ ప్రాజెక్టును కేవలం ప్రాంతీయ రవాణా అవసరాలకు మాత్రమే పరిమితం చేయకుండా, భవిష్యత్తులో ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ప్రత్యామ్నాయ రైల్వే అనుసంధానంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని నంగే శ్రీనివాస్ సూచించారు. ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా, దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
భవిష్యత్తులో సెమీ హైస్పీడ్ రైళ్లకు అనువైన మౌలిక సదుపాయాల సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ కలను సాకారం చేసేందుకు రీ సర్వే నివేదికను ఖరారు చేసి, ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని నంగే శ్రీనివాస్ కోరారు. కేంద్రానికి సానుకూల సిఫారసులు పంపి ప్రాజెక్టు ఆమోదం, నిధుల కేటాయింపులకు చొరవ చూపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను విజ్ఞప్తి చేశారు