బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
-జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వినతిపత్రం
మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి హక్కుల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. బీసీలపై ఉన్న 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలని, బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని, ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు రూ. 2 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలని, ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలలోనూ రోస్టర్ విధానం అమలు చేసి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికతో పాటు బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, నాయకులు శాఖపురం భీమసేన్, వేముల కిరణ్, గులాం హుస్సేన్, కొట్టే నటేశ్వర్, చలమల అంజయ్య, కీర్తి రవి, ఎండీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు