ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. వైద్యాధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన
భువనగిరి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు, గర్భధారణ సమయంలో అవసరమైన వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణులకు సాధారణ ప్రసవాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యత
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మాతాశిశు మరణాల నివారణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.