మహిళలు, బాలికల భద్రతకు పోలీసుశాఖ కట్టుబడి ఉంది
మహిళలు, బాలికల భద్రతకు పోలీసుశాఖ కట్టుబడి ఉంది: ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్: మహిళలు, బాలికల భద్రతకు నిర్మల్ జిల్లా పోలీసుశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
మహిళా రక్షణ బృందం షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్మల్ హరితవనంలో మహిళలు, యువతులకు మహిళల భద్రతా చట్టాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, ఫిర్యాదుదారుల వివరాల గోప్యత, మహిళలపై వేధింపులు, సైబర్ దాడులు, బాల్యవివాహాల నిరోధం, మహిళల అక్రమ రవాణా, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందే విధానాలపై అవగాహన కల్పించారు.
వేధింపులకు సంబంధించిన సందేశాలు, ఫొటోలు, ఇతర ఆధారాలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు.
మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరారు. మహిళలపై వేధింపులు, బాల్యవివాహాలు వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.