7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
గిరిజనులకు బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల డిమాండ్
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): రాష్ట్రంలో 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు గిరిజనులకు హక్కు పత్రాలు జారీ చేయాలని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మహాసభల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమాలో శనివారం ర్యాలీ, బహిరంగ సభతో ప్రారంభమైన మహాసభలు.. రెండో రోజు ఆదివారం బండ్లగూడలో ప్రతినిధుల సభతో కొనసాగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఎంపికైన 250 మంది ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్రీరామ్ నాయక్ గత మూడేళ్లలో సంఘం నిర్వహించిన ఆందోళనలు, పోరాటాలకు సంబంధించిన నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ప్రతినిధులు చర్చించారు.
గత ప్రభుత్వం జారీ చేసిన పోడు భూముల పట్టాలపై బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని మహాసభలు కోరాయి. అలాగే వి.బి.-జి. రామ్ జీ ఉపాధి హామీ పథకాన్ని పునర్నిర్మించాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని తీర్మానించాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో తొలగించిన గిరిజన ఓటర్ల పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశాయి.
మహాసభల్లో తెలంగాణ గిరిజన సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. ధర్మా నాయక్, కార్యదర్శిగా ఆర్. శ్రీరామ్ నాయక్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మంగ్య భూక్యా, ఆవాజ్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్‌ఐ, ఐద్వా రాష్ట్ర నాయకులు ఎం.డి. అబ్బాస్, టి. సాగర్, కోట రమేష్, ఆర్. వెంకట్రాములు, పి. శశికళతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.