అటవీ భూముల క్లాసిఫికేషన్ మార్చాలి వేముల బక్కయ్య
రమణక్కపేట, అక్టోబర్ 7:
అటవీ భూముల క్లాసిఫికేషన్‌ను మార్చి, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలను రిసర్వేలో చేర్చి వారికి పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ మహాసభల పిలుపులో భాగంగా రమణక్కపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ.. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయడం లేదన్నారు. సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆయా భూములు అటవీ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని, క్లాసిఫికేషన్ మార్చితే పట్టాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారని తెలిపారు. అటవీ భూముల క్లాసిఫికేషన్‌ను మార్చి పేదల సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చినా, 125 రోజుల పని కల్పిస్తామని ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, రోజువారీ కూలీ రూ.700కు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, పారితోషికంతో పాటు ఇతర అలవెన్సులు అందించాలని డిమాండ్ చేశారు.
పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాల పథకాన్ని అమలు చేయాలని, బియ్యం, కందిపప్పు, కూరగాయల ధరలను నియంత్రించాలని కోరారు. ఓటర్ల జాబితాలో తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భరత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.
గ్రామాల్లో ఆక్రమణకు గురైన స్మశాన భూములను స్వాధీనం చేసుకుని రక్షించాలని, మౌలిక వసతులు కల్పించాలని, ఎన్‌ఎస్‌పీ కాల్వపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. పశువైద్యశాలకు నూతన భవనం నిర్మించాలని కోరారు.
ధర్నాలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లెపాము భవాని, ధారా బేబిశాలి, నందిపాము రాణి, ఆమదాల వెంకన్న, మత్తే సిమోను, ఆముదాల సురేష్, వేముల చంటి, ఆముదాల చినబాబు, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.