ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
రెవెన్యూ సహాయకుల (వీఆర) సంఘం చేపట్టిన నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం శనివారం 11వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో
విధిలేని పరిస్థితుల్లో వీఆర్ఎలు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిక్షాటన కార్యక్రమం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న విధంగా తమకు పే స్కేల్ను అమలు చేయాలని, నామినీ వీఆర్ఎలను రెగ్యులర్ చేయాలని, అర్హులైన వీఆర్ఎలకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే బిక్షాటన కార్యక్రమానికి దిగాల్సి వచ్చిందని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వద్దకు ప్రతీకాత్మకంగా “భిక్ష" రూపంలో తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వీఆర్ఎలు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు. అనంతరం వీఆర్ఎలు తహసీల్దార్ ఆర్.డి. రామచంద్ర మూర్తిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్, వీఆర్ఎల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు.