పాత నాటుసారా కేసులో పరారీలో ఉన్న మహిళ అరెస్ట్
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో పాత నాటుసారా కేసులో పరారీలో ఉన్న మహిళను చింతలపూడి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) కె.వి.ఎన్. ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. ఆవులయ్య ఆదేశాల మేరకు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది రేచర్ల గ్రామంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత నాటుసారా కేసులో పరారీలో ఉన్న బాణావతు పిచ్చెమ్మను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
అదేవిధంగా చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్‌లను పరిశీలించడంతో పాటు ఏపీ సురక్ష ఆన్‌లైన్ యాప్ ద్వారా కొన్ని మద్యం సీసాలను తనిఖీ చేశారు.
మద్యం విక్రయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వహించాలని, ఎక్సైజ్ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దుకాణాల సేల్స్ సిబ్బందికి అధికారులు సూచించారు. మద్యం స్టాక్, విక్రయాలకు సంబంధించిన అన్ని వివరాలను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలు, దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌ఐలు అబ్దుల్ ఖలీల్, జె. జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు.