మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి
నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్‌బీనగర్ (ఎన్ టుడే న్యూస్): మహిళలు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.
జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, చంపాపేట డివిజన్ యువ నాయకురాలు సంధ్య రవి ముదిరాజ్ అధ్యక్షతన స్థానిక మోడల్ మార్కెట్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ కమల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక మహిళ నైపుణ్యం సాధిస్తే ఆ కుటుంబం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని, కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం కూడా ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో ప్రాథమిక స్థాయి నుంచి ఆధునిక కుట్టు నైపుణ్యాలతోపాటు బ్యూటీషియన్, మెహందీ వంటి ఉపాధికి ఉపయోగపడే కోర్సుల్లోనూ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, తద్వారా తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
మహిళల నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రమాదేవి, ఉష, ప్యారి, కవిత, లావణ్య, స్వయం ప్రభు, ట్రస్ట్ ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, శిక్షణ పొందిన మహిళలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.