పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపూరు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులకు సమతుల్య పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్, మునుగోడు ప్రాజెక్టు సీడీపీఓ లావణ్య కుమారి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు తదితరాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యుల సూచనలు పాటించాలని, గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లి తీసుకునే సమతుల్య ఆహారం ఎంతో కీలకమని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న బాలామృతం, గుడ్లు, పాలు, ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని లబ్ధిదారులు క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సునీత, ఉపాధ్యాయుడు శివ, ఏఎన్‌ఎం మల్లేశ్వరి, గ్రామ పెద్దలు, తల్లులు, అంగన్‌వాడీ టీచర్లు డి. ధనలక్ష్మి, ఎన్. హంసమ్మ తదితరులు పాల్గొన్నారు.