Irumudi: ఇరుముడి’ సినిమా వ్యవహారంలో కీలక పరిణామం
మైనర్ బాలికతో షూటింగ్‌పై కార్మిక శాఖ నోటీసులు నిర్మాతల నుంచి వివరణ కోరిన అధికారులు
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన అంశంపై తెలంగాణ కార్మిక శాఖ స్పందించింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనల అమలుపై వివరణ ఇవ్వాలని సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు ఆధారంగా కార్మిక శాఖ ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. మైనర్ బాలిక విషయంలో నిబంధనలు పాటించారా సినిమా చిత్రీకరణలో మైనర్ బాలికను భాగస్వామ్యం చేసిన సమయంలో చట్టపరమైన నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై అధికారులు వివరాలు కోరారు. చిత్రీకరణకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా, బాలిక తల్లిదండ్రుల సమ్మతి పొందారా అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని నిర్మాతలకు సూచించారు. బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, హాజరు వివరాలు, షూటింగ్‌లో పాల్గొన్న సమయం, పని గంటలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారా సినిమా షూటింగ్ కారణంగా బాలిక విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న జాగ్రత్తలపైనా కార్మిక శాఖ ఆరా తీసింది. చిత్రీకరణ సమయంలో బాలిక సంక్షేమం, భద్రతకు సంబంధించి నిబంధనలను అమలు చేశారా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే బాలికకు చెల్లించిన పారితోషికంలో నిబంధనల ప్రకారం 20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా లేదా అనే వివరాలను కూడా అడిగినట్లు సమాచారం. ప్రమోషనల్ కార్యక్రమాలపైనా ఆరా సినిమా షూటింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలు, ప్రీ-రిలీజ్ వేడుకల్లో మైనర్ బాలిక పాల్గొన్న విషయంలోనూ నిబంధనలు పాటించారా అనే అంశంపై అధికారులు వివరణ కోరారు. నిర్మాతలు సమర్పించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాలల హక్కులు, విద్య, భద్రతకు సంబంధించిన నిబంధనల అమలుపై ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. అయితే, నిర్మాతల నుంచి వచ్చిన అధికారిక వివరణ, కార్మిక శాఖ తదుపరి చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.