చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ చామల విజ్ఞప్తి
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న రైల్వే గేట్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. చిట్యాల పట్టణంలోని రైల్వే గేట్ నంబర్ 26 (Local-49/15-16) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
చిట్యాల మున్సిపాలిటీ నుంచి మునుగోడు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బీబీనగర్–నాదికుడ/నల్గొండ రైల్వే మార్గంలో ఈ గేట్ ఉండటంతో నిత్యం భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని ఎంపీ తన లేఖలో వివరించారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణంతో పాటు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఈ రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి రైలు రాకపోకల సమయంలో సుమారు 15 నిమిషాల పాటు గేట్ మూసివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అదేవిధంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల రద్దీ కూడా ఈ ప్రాంతంలో కలవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని వివరించారు. రైల్వే లైన్ విద్యుద్దీకరణ పూర్తయిన నేపథ్యంలో రైళ్ల రాకపోకల సంఖ్య పెరగడంతో గేట్ మూసివేత సమయం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా పెరిగాయని పేర్కొన్నారు.
ప్రజల ప్రయాణ సౌకర్యం, రహదారి భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకొని చిట్యాల రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.