బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు
నిత్యం సుమారు 100 మంది రోగులకు వైద్య పరీక్షలు.. గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు
సెల్యులైటిస్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డాక్టర్ స్రవంతి లెనిన్ చంద్ర
కురవి, ఎన్ టూ డే న్యూస్:
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్రవంతి లెనిన్ చంద్ర సూచించారు.
శుక్రవారం తొవ్వ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం రోజుకు సుమారు 100 మంది రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తాను విధుల్లో చేరిన తొలినాళ్లలో రోగుల సంఖ్య తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.
ప్రతి రోగికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు
పీహెచ్‌సీకి ఎక్కువగా జ్వరం, వాంతులు, విరేచనాలు, సెల్యులైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు వస్తుంటారని డాక్టర్ తెలిపారు. ప్రతి రోగిని క్షుణ్ణంగా పరీక్షించి, సమస్యకు అనుగుణంగా మందులు అందిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి రెండు రోజుల తర్వాత తిరిగి పరీక్షల కోసం రావాలని సూచిస్తున్నామని తెలిపారు.
రోగుల ఫోన్ నంబర్లు తీసుకుని, చికిత్స అనంతరం రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని వివరించారు. చికిత్సలో భాగంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
సెల్యులైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో సెల్యులైటిస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్ స్రవంతి తెలిపారు. ఈ సమస్యలో సాధారణంగా కాళ్లు ఎర్రబడటం, వాపు రావడం, తీవ్రమైన నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ తీవ్రమై ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
సెల్యులైటిస్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని చెప్పారు. కొందరికి కాళ్లను ఎత్తుగా ఉంచి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ, ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలని చెబుతున్నామని వివరించారు.
పాము, కుక్క, కోతి కాటుకు మందులు అందుబాటులో
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుక్కకాటు, కోతికాటు, పాముకాటు, తేలుకాటు బాధితులకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కుక్కలు, కోతుల కాటుకు గురైన వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.
గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ స్రవంతి తెలిపారు. గర్భిణులు ప్రతి నెలా నిర్ణీత సమయానికి పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు.
ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు పెట్టుకోకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స పొందాలని డాక్టర్ స్రవంతి లెనిన్ చంద్ర కోరారు.