ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి
గ్రాడ్యుయేట్ యువత వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలే కథానాయకులు: మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మహబూబాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ సూచించారు. కేసముద్రం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓటరు నమోదు సమీక్ష సమావేశంలో ఆమె మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పట్టభద్రులైన యువత ప్రతి ఒక్కరూ వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున తమ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు కూడా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి నమోదు చేయించాలని సూచించారు. మండలంలోని పార్టీ నాయకులు, బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా యువతను మోసం చేసిందని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తలే కథానాయకులు
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపులో కార్యకర్తలే కీలక పాత్ర పోషించాలని అన్నారు. భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలంటే అత్యధిక సంఖ్యలో పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలని పేర్కొన్నారు.
ప్రతి కార్యకర్త తానే ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న భావనతో కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పట్టభద్రుల ఓటరు నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి బాధ్యులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కనీసం 80 శాతానికి పైగా పట్టభద్రుల ఓటరు నమోదు సాధించేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్, మండల అధికార ప్రతినిధి మోడం రవీందర్ గౌడ్, మండల నాయకులు దీకొండ వెంకన్న, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూన భద్రాద్రి, కౌన్సిలర్లు ఆగే రాము, పాయిరాల శరత్, రావుల వినయ్ రెడ్డి, మేకల శారద సురేష్, బానోత్ అరుణ దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సర్పంచులు ఏర్పుల సునీత కుమారస్వామి, ఈసం లక్ష్మీనారాయణ, బోడ వీరన్న, శంకర్, జ్యోతి పవన్, తార సింగ్, భానోత్ వెంకన్న, కొండపల్లి రాకేష్ రెడ్డి, బొంత వెంకన్న, రవీందర్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు హాజరయ్యారు.