అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ చప్పిడి నాగరాజు
బయ్యారం:
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బయ్యారం తహసీల్దార్ చప్పిడి నాగరాజు సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు బయ్యారం మండలంలో 1,488 ఆన్‌లైన్ దరఖాస్తులు, నాలుగు మాన్యువల్ దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు
2023 నవంబర్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తహసీల్దార్ వివరించారు. సెప్టెంబర్ 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హులైన పట్టభద్రులు తమ విద్యార్హత ధ్రువపత్రాలను జతచేసి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు నమోదు కావడానికి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
దరఖాస్తుల గడువు ముగియకముందే అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ చప్పిడి నాగరాజు కోరారు.