సురక్షితమైన పని ప్రదేశం ప్రతి మహిళ హక్కు
సురక్షితమైన పని ప్రదేశం ప్రతి మహిళ హక్కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ
లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013ను పకడ్బందీగా అమలు చేయాలి
భీమవరం, అక్టోబర్ 6:
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013ను అన్ని సంస్థల్లో కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
భీమవరం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 అమలు తీరుపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, అసంఘటిత రంగాల్లో చట్టం అమలు తీరును సమీక్షించారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు, ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యులకు చట్టంలోని నిబంధనలు, ఫిర్యాదుల స్వీకరణ, విచారణ విధానం, బాధితుల గోప్యత పరిరక్షణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు.
మహిళల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను ఎలాంటి భయం లేకుండా తెలియజేసే వాతావరణాన్ని ప్రతి సంస్థ కల్పించాలని పేర్కొన్నారు. మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయడమే చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, మహిళలకు పని ప్రదేశాల్లో సమాన అవకాశాలు కల్పించడంతో పాటు సురక్షితమైన వాతావరణం అందించాలని అన్నారు. బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా వెల్లడించవచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చట్టం అమలుకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో మహిళా సిబ్బందికి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
మహిళల హక్కులు, ఫిర్యాదు చేసే విధానం, అందుబాటులో ఉన్న రక్షణ చర్యలపై ఉద్యోగులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని సంస్థల్లో చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
వివిధ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు, చట్టం అమలు స్థితి, అవగాహన కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ అడ్వైజరీ సభ్యురాలు ఆర్. సుయాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సీడీపీవోలు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.