జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
తిరువూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు జర్నలిస్టులు తిరువూరు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు, మీడియా సంస్థల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని, వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని కోరారు. మీడియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల ఆరోగ్య పథకం సక్రమ అమలు కోసం త్రైపాక్షిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు.
అదేవిధంగా జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారి హక్కులు, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ డిమాండ్ల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు కోరారు.