ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం
ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. రిమ్స్‌లోని ఎస్ఎన్‌సీయూ చిన్నారుల వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో వార్డులో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురై తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఐదు రోజుల వయసున్న ఓ శిశువు మృతి చెందినట్లు సమాచారం. మరో 24 మంది చిన్నారులను చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వార్డులో ఉన్న చిన్నారులను సురక్షితంగా పక్క వార్డుకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.