హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు.. రూ.8 వేల జరిమానా విధింపు
- వివిధ సెక్షన్ల కింద శిక్షలు
- ప్రాసిక్యూషన్ తరఫున హాజరైన అధికారులు
- పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ | అక్టోబర్ 26 | ఎన్ టుడే న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన హత్య, అత్యాచారం కేసులో నిందితుడు చిన్నపాక రవితేజకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు.
కోర్టు తీర్పు ప్రకారం, ఐపీసీ సెక్షన్ 302 కింద జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. సెక్షన్ 376-G కింద ఏడేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అలాగే సెక్షన్లు 201, 379 కింద ఒక్కో సెక్షన్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి, రిటైర్డ్ ఏసీపీ భుజంగరావు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ, కోర్టు డ్యూటీ అధికారి పీసీ-4118 ఏ. రాము, సమన్ల అమలులో సహకరించిన పీసీ-9667 మహేశ్ ప్రాసిక్యూషన్ తరఫున హాజరయ్యారు.
కేసు దర్యాప్తు, విచారణ పురోగతిలో సహకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ అభినందించినట్లు పోలీసులు తెలిపారు.