జనార్ధనవరంలో ఘనంగా అంగన్వాడీ మాసోత్సవాలు
ప్రజా సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగన్వాడీ ఉత్సవాలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో అంగన్వాడీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ పర్యవేక్షకురాలు పి. గాయత్రిదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, వైసీపీ నేత పోతిరెడ్డిపల్లి కృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు వివిధ సేవలు అందుతున్నాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మాదాసు చంద్రకళ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పి. గాయత్రిదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సేవలను అందిస్తున్నామని తెలిపారు. పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎన్. కళ్యాణి, సీహెచ్. శివకుమారి, టి. స్వరూపరాణి, ఈ. జమలమ్మ, సహాయకులు జయలక్ష్మి, రాధా, పద్మలను నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో సిహెచ్వో ప్రియదర్శిని, వంగల సుబ్బారావు, ఇజ్జిగాని మురళి, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.