అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే ఏపీ పెన్షన్ల పంపిణీ
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమించడంతో పెన్షన్‌దారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రంలో 61.80 లక్షల మంది పెన్షన్‌దారులకు రూ.2,692 కోట్ల మేర నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీ నుంచే సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పంపిణీ సమయంపై తొలుత మార్పులు చేశారు.
సమ్మె కొనసాగుతుందన్న నేపథ్యంలో అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ముందుగా నిర్ణయించారు. తాజాగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెను విరమించడంతో ఆ నిర్ణయంలో మార్పు చేసి ఉదయం 6:30 గంటల నుంచే పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెన్షన్ల పంపిణీకి అవసరమైన నగదును స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది సెప్టెంబర్ 30న బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోనున్నారు. దీంతో అక్టోబర్ 1 ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్యాంకు సమ్మె కారణంగా పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతుందనే ఆందోళనకు తాజా నిర్ణయంతో తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులకు నిర్ణీత సమయానికి నగదు అందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.