SLBC, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు ఆర్మీ ఇంజినీరింగ్ నైపుణ్యం
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను మరింత పటిష్టంగా చేపట్టేందుకు భారత సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగం నుంచి అదనపు అధికారులను డెప్యుటేషన్‌పై తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్ తెలంగాణ ప్రభుత్వం పరిశీలన కోసం ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ ఎ. మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.వి. భల్లా పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వీరిని డెప్యుటేషన్‌పై తీసుకుని కీలక సాగునీటి పునరుద్ధరణ పనుల్లో నియమించే అవకాశం ఉంది.
ఇటీవల న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినట్లు తెలిపారు. తెలంగాణలో చేపడుతున్న పునరుద్ధరణ పనుల కోసం అనుభవజ్ఞులైన ఆర్మీ ఇంజినీర్లను డెప్యుటేషన్‌పై పంపించాలని ఆయన కోరినట్లు పేర్కొన్నారు.
SLBC టన్నెల్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు సాంకేతికంగా సంక్లిష్టమైనవని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఇంజినీరింగ్ విభాగానికి ఉన్న సాంకేతిక అనుభవం, నైపుణ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా పనుల అమలులో మరింత సాంకేతిక సహకారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
పునరుద్ధరణ పనుల్లో నాణ్యత, భద్రత, సాంకేతిక ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు మంత్రి తెలిపారు.