తిరువూరులో ఆశా వర్కర్ల నిరసన
తిరువూరు పట్టణంలో ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించి పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వారాంతపు, జాతీయ, పండుగ సెలవులు కల్పించాలని, దహన సంస్కారాల భత్యాలు అందించాలని కోరారు. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని, జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
పీహెచ్‌సీలకు విధుల నిమిత్తం వెళ్లిన ప్రతిసారీ టీ, డీఏలు చెల్లించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫారాలు అందించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కమల, బి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.