ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పురపాలక సంఘం కమిషనర్ పి. శ్రీధర్ నేతృత్వంలో కనిగిరి పురపాలక సంఘం, మార్కాపురం జిల్లా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన వ్యర్థాలు అనే నాలుగు రకాల వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని ఆసుపత్రి సిబ్బంది, ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వినియోగం నిషేధం, రెడ్యూస్ , రియూజ్ , రిసైకిల్ విధానంపై అవగాహన కల్పించారు.శానిటరీ ఇన్‌స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచగలమని, పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్య భద్రతకు ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.ఆసుపత్రి పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించినందున ఎవరూ ప్లాస్టిక్ కవర్లను ఆసుపత్రిలోకి తీసుకురావద్దని సూచించారు. వ్యర్థాలను బహిరంగంగా కాల్చరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించబడతాయని తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్ వెంకట సుబ్బయ్య, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ జిల్లా సభ్యులు గుడ్ హెల్ప్ రమేష్ బాబు, పట్టణ శానిటరీ సెక్రటరీలు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.