వెల్గటూర్ బ్రిలియంట్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు.. చిన్నారుల నృత్యాలు ఆకర్షణ
వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో పాఠశాల చిన్నారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాఠశాల యాజమాన్యం సిరిపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ పాటలు, సంగీతానికి అనుగుణంగా కోలాటాలు ఆడుతూ, ఉత్సాహభరితంగా నృత్యాలు చేశారు. చిన్నారుల ప్రదర్శనలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చిన్నారులకు పరిచయం చేయడంతో పాటు సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేలా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.