బిగ్‌బాస్కెట్ రైడర్ల పేఅవుట్ పెంచాలి
సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 8 (ఎన్‌టుడే న్యూస్): బిగ్‌బాస్కెట్ డెలివరీ రైడర్ల పేఅవుట్‌ను గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద బిగ్‌బాస్కెట్ రైడర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైడర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు సుమారు 14 నుంచి 16 గంటల పాటు ఎండ, వర్షం, ట్రాఫిక్‌ను ఎదుర్కొంటూ పనిచేస్తున్నప్పటికీ తమ శ్రమకు తగిన పారితోషికం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఒక్కో ఆర్డర్‌కు రూ.25 వరకు పేఅవుట్ చెల్లించేవారని, ప్రస్తుతం దానిని రూ.15కు తగ్గించారని తెలిపారు. పేఅవుట్‌ను తిరిగి పెంచాలని కోరిన నేపథ్యంలో సుమారు 50 మంది రైడర్ల ఐడీలను బ్లాక్ చేసినట్లు వారు ఎమ్మెల్యేకు వివరించారు.
రైడర్ల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఆర్డర్‌కు కనీస బేస్ పేఅవుట్‌ను రూ.25గా కొనసాగించాలని, బ్లాక్ చేసిన రైడర్ల ఐడీలను వెంటనే పునరుద్ధరించాలని వారు కోరారు.
అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్టోర్ ఇన్‌చార్జి పాషాను పిలిపించి రైడర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్‌చార్జి తెలిపారు.
రైడర్ల సమస్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, గండి సన్నీ యాదవ్, రమణారెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు.