సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అన్నదమ్ముల అనుబంధం: మందపాటి మహేశ్వరరెడ్డి
చాట్రాయి: రాష్ట్రాలు విడిపోయినా సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు మందపాటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతపురం గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పర్వతపురం గ్రామ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన మహేశ్వరరెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు వేరైనా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని ఆయన అన్నారు. విఘ్నేశ్వరుడి కృపతో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, అన్ని విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో మందపాటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి వెంకటరెడ్డి, భూబత్తుల చెన్నారావు, బొర్రా నాగేశ్వరరావు, మిద్దె సత్యనారాయణ, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.