నాలుగేళ్లలోపు పిల్లలకు కొన్ని జలుబు మందులపై కేంద్రం ఆంక్షలు
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్, ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా ఆదేశాల ప్రకారం ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీదారులు తమ ఉత్పత్తుల లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్‌ను ఉపయోగించకూడదనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాల్సి ఉంటుంది. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
2025లోనే ఆంక్షలకు శ్రీకారం
క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్‌పై కేంద్రం 2025 ఏప్రిల్ 15న తొలిసారిగా ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫార్సుల ఆధారంగా నాలుగేళ్లలోపు పిల్లల్లో ఈ మందుల వినియోగంతో ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.
తాజా నోటిఫికేషన్ ద్వారా గతంలో విధించిన ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ, క్లోర్ఫెనిరామైన్ మేలేట్, ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన సంబంధిత అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో వినియోగ పరిమితిని వర్తింపజేశారు.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఆంక్షలను అమలు చేస్తోంది.